Dec 20 2018
పెరాక్ లో తక్కువ బడ్జెట్ తో షూటింగ్ చేసుకోవచ్చు అంటూ తెలుగు సినిమా నిర్మాతలను ఆహ్వానించిన మలేషియాలోని పెరాక్ రాష్ట్ర ముఖ్యమంత్రి’దాతో శ్రీ అహమద్ ఫైజల్ అజుమూ
పెరాక్ లో తక్కువ బడ్జెట్ తో షూటింగ్ చేసుకోవచ్చు అంటూ తెలుగు సినిమా నిర్మాతలను ఆహ్వానించిన మలేషియాలోని పెరాక్ రాష్ట్ర ముఖ్యమంత్రి‘దాతో శ్రీ అహమద్ ఫైజల్ అజుమూ’
తెలుగు సినిమా రోజురోజుకు అభివృద్ది చెందుతుండడం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా..విదేశాల్లో సైతం తెలుగు సినిమాకి డిమాండ్ ఉండడంతో రచయితలు, దర్శకనిర్మాతలు విదేశాల్లో ఉన్న ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కథలు రెడీ చేస్తున్నారు. విదేశాల్లో షూటింగ్ చేసే సినిమాలకు ఆయా దేశాలు షూటింగ్ పర్మిషన్స్ సకాలంలో ఇప్పించడంతో పాటు రిటర్న్ గిఫ్ట్ లా కొంత మొత్తాన్ని కూడా ఇస్తున్నాయి. తాజాగా మలేషియా ప్రభుత్వం కూడా తమ దేశంలో షూటింగ్ చేస్తే సకాల సదుపాయాలను కల్పించడంతో పాటు తమ దేశంలో కావల్సిన అన్ని పర్మిషన్స్ ను వెంటనే అందిస్తామంటోంది.
మలేషియాలోని పెరాక్ రాష్ట్ర ముఖ్యమంత్రి దాతో శ్రీ అహమద్ ఫైజల్ అజుమూతో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మీట్ & గ్రీట్ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి గురు ఫిల్మ్స్ సునీత తాటి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో మలేషియాలోని పెరాక్ రాష్ట్ర ముఖ్యమంత్రి దాతో శ్రీ అహమద్ పైజల్ అజుమూ మాట్లాడుతూ…నా ఫ్రెండ్ మహేష్ తో ఎప్పటి నుంచో ఇండియా రావాలి అని చెప్పాను. ఈరోజు హైదరాబాద్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇండియా ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం. మలేషియాలో సంవత్సరానికి ఒకసారైనా ఇండియా ఫుడ్ తింటుంటాను. కౌలాలాంపూర్ నుంచి చెన్నైకి రావడానికి 3 గంటలు పట్టింది. చెన్నై నుంచి హైదరాబాద్ రావడానికి 3 గంటల టైమ్ పట్టింది. దీనిని బట్టి ఇండియా ఎంత పెద్దదో అర్ధం చేసుకోవచ్చు.
ఇక నా గురించి చెప్పాలంటే..దత్తా శ్రీ అహమద్ ఫైజల్ అజుమూ అయినప్పటికీ పెజా అని పిలుస్తారు. మలేషియాలో 13 రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడ ఉన్న పెద్ద రాష్ట్రాల్లో పెరాక్ ఒకటి. పెరాక్ అంటే సిల్వర్ అని అర్ధం. ఈ రాష్ట్రంలో 48% అడవి ఉంటుంది. పెరాక్ లో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. సినిమా షూటింగ్ నిమిత్తం నిర్మాతలు ఏసియాలో చాలా దేశాలకు వెళ్లుంటారు. అయితే…పెరాక్ రాష్ట్రం రావాలని కోరుతున్నాను. తెలుగు నిర్మాతలను ఆహ్వానించడం కోసమే హైదరాబాద్ వచ్చాను. నా మిత్రుడు మహేష్, వివేక్ కూచిభట్ల నన్ను ఇక్కడికి రావాలని ఆహ్వానించారు. వారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ తెలియచేస్తున్నాను.
ప్రపంచంలోనే బిగ్గెస్ట్ బిజినెస్ ఏషియాలోనే జరుగుతోంది. ఏషియన్స్ అందరూ ఒక్కటే అని నా ఫీలింగ్. షూటింగ్ నిమిత్తం యు.ఎస్ వెళుతుంటారు. కానీ..ఇండియన్ మూవీస్ ని అక్కడ చూడరు. ఏషియాలో లోకేషన్స్ చాలా ఉన్నాయి. అందుచేత ఇక్కడే షూటింగ్ చేయాలని కోరుతున్నాను. చిన్నప్పటి నుంచి ఇండియన్ సినిమాని ఫాలో అవుతుంటాను. కానీ..ఇండియన్ సినిమాలని ఏసియాలో కాకుండా ఎక్కువుగా యు.ఎస్ లో షూటింగ్ చేస్తుండడం బాధగా అనిపిస్తుంది. పెరాక్ రాష్ట్రంలో షూటింగ్ చేస్తే తక్కువ బడ్జెట్ అవుతుంది. మా దగ్గర డ్యాన్సర్స్, టెక్నీషియన్న్ చాలా మంది ఉన్నారు. అలాగే మా రాష్ట్రంలో తెలుగు, తమిళ సినిమాలను ఎక్కువగా చూస్తుంటారు. తెలుగు సినిమాల్లో సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. పెరాక్ లో మీరు కావాలంటే సెట్స్ కూడా వేసుకోవచ్చు. బడ్జెట్ కూడా చాలా తక్కువు అవుతుంది. అందుచేత తెలుగు సినిమా నిర్మాతలు, దర్శకులు పెరాక్ రాష్ట్రంలో రావాలని..షూటింగ్స్ చేయాలని ఆహ్వానిస్తున్నాను అన్నారు.
మలేషియాలో పెరాక్ మాత్రమే కాకుండా కంబోడియా, థాయ్ లాండ్, సింగపూర్ లలో షూటింగ్ చేసుకోవచ్చు. మా రాష్ట్రంలో చాలా మంది ఇండియన్స్ ఉన్నారు. మలేషియాను ట్రూలీ ఏసియా అంటారు. వేరే దేశంలో షూటింగ్ చేయడం కంటే మా దగ్గర షూటింగ్ చేస్తే చాలా తక్కువ బడ్జెట్ అవుతుంది. పెరాక్ లో చాలా మందికి సినిమా అంటే ఇష్టం. వాళ్లు ఫ్రీగా నటించడానికి కూడా రెడీ. ఒక్కసారి తెర పై కనిపిస్తే చాలు అనుకుంటారు. అంతిష్టం వాళ్లకి సినిమా అంటే. మీకు ఎలాంటి పర్మిషన్ కావాలన్నా నన్ను సంప్రదిస్తే వెంటనే అనుమతి ఇస్తాను. ఈరోజు ఇలా తెలుగు సినిమా నిర్మాతలను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.
ప్రముఖ నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ…మా దేశం వచ్చినందుకు పెరాక్ రాష్ట్ర ముఖ్యమంత్రి దాతో శ్రీ అహమద్ పైజల్ అజుమూ గారికి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. అలాగే ఆయన పవర్ ఫుల్ స్పీచ్ వినడం హ్యాపీగా ఫీలవుతున్నాను. ఇక నుంచి మా సినిమా మేనేజర్లు యూరప్ అంటే వెళ్లం. మలేషియాకే వస్తాం. మలేషియా అంటే కౌలాలాంపూర్ మాత్రమే అనుకునే వాళ్లం. కానీ…చాలా మంచి బ్యూటీఫుల్ ప్లేసెస్ ఉన్నాయి ఇప్పుడే తెలిసింది. సినిమా అనేది ప్రపంచాన్ని చూడడానికి విండో లాంటిది. వెంటనే పెరాక్ లో షూటింగ్ చేయాలనిపిస్తుంది. పెరాక్ ముఖ్యమంత్రి దాతో శ్రీ అహమద్ ఫైజల్ అజుమూ గారితో మీట & గ్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేష్,వివేక్ కూచిభట్లకు థ్యాంక్స్ తెలియచేస్తున్నాను అన్నారు.
అడివి శేష్ మాట్లాడుతూ…త్వరలోనే పెరాక్ లో షూటింగ్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.
పెరాక్ రాష్ట్ర ముఖ్యమంత్రి దాతో శ్రీ అహమద్ ఫైజల్ అజుమూ గార్ని నిర్మాత వివేక్ కూచిభట్ల శాలువా, పుష్పగుఛ్చం ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి, రాథామోహన్, డి.ఎస్.రావు, మైత్రీ మూవీస్ రవి, అభిషేక్ నామా, అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, శివకుమార్, రాజ్ కందుకూరి, రామసత్యనారాయణ, వల్లూరిపల్లి రమేష్, జగన్, బెక్కం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.