తెనాలి లో ‘ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ‘

     ఈ నెల 19 వ తేది నుంచి నాలుగు రోజుల పాటు గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ఇంటర్నేషనల్   ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టు ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఏవీయస్ తెలిపారు. శుక్రవారం   ఉదయం ఇక్కడి నిర్మాతల మండలి హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ   తెనాలి కల్చరల్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చిత్రోత్సవాలలో 17 దేశాలనుంచి 20 కి   పైగా చిత్రాలను ప్రదర్శిస్తున్నామని , దివంగత దర్శకుడు శాంతారామ్ కు నివాళిగా ” ఝనక్ ఝనక్  పాయల్ బాజే ” చిత్రాన్ని ప్రదర్శిస్తున్నామని, ఈ ఉత్సవాలలో తెలుగు నుంచి సునీల్ కుమార్ రెడ్డి నిర్మించిన ‘ గంగ పుత్రులు ‘ ఎంపిక అయిందని తెలిపారు. 19 వ తేదిన దివంగత ఎన్.టి.ఆర్.   పురస్కారాన్ని ప్రముఖ నిర్మాత డా. డి. రామానాయుడు కు అందచేస్తున్నట్లు ఆయన చెప్పారు. ” ఈ సభలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ , ఫిలిం చాంబర్ అధ్యక్షులు తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాతలమండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ ,  ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్  తదితరులు అతిధులుగా పాల్గొంటారు. 20 వ తేదిన ఎస్వీ రంగారావు  స్మారక పురస్కారాన్ని ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి కి, 21 వ తేదిన సావిత్రి స్మారక   పురస్కారాన్ని సుప్రసిద్ధ నటి తెలంగాణా శకుంతలకు, 22 వ తేదిన బొల్లిముంత శివరామకృష్ణ   పురస్కారాన్ని ప్రముఖ రచయిత జె.కె.భారవి కి, వేటూరి సుందరరామమూర్తి స్మారక   పురస్కారాన్ని రచయిత అనంత్ శ్రీరాం కు, అల్లు రామలింగయ్య స్మారక పురస్కారాన్ని నటుడు గుండు హనుమంతరావు కు ప్రదానం చేయనున్నాము ” అని ఏవీయస్ వివరించారు.

  ఈ విలేకరుల సమావేశంలో సౌత్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్స్ కార్యదర్శి ప్రకాష్ రెడ్డి, దర్శకుడు ఎన్.శంకర్ , తెనాలి కల్చరల్ ఫిలిం సొసైటి జనరల్ సెక్రటరి బొల్లిముంత కృష్ణ, సహాయ  కార్యదర్శి బి.మురళి తదితరులు పాల్గొన్నారు.