‘A..Aa’ vijayotsavanm in ‘amaravati’

 

                        వైభవంగా  అమరావతి లో ‘అఆ’ విజయోత్సవం 

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నితిన్, సమంత జంటగా ఎస్.రాధాకృష్ణ(చినబాబు) నిర్మించిన చిత్రం ‘అఆ’. ఈ సినిమా జూన్ 2న విడుదలై ఘనవిజయాన్ని సాధించిన సందర్భంగా  చిత్రయూనిట్ గుంటూరులోని సిద్దార్ధ్ గార్డెన్స్ లో విజయోత్సవాన్ని ఆదివారం (జూన్12) రోజున అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా …

దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ ‘’ప్రేక్షకులకు థాంక్స్ అనే మాట చిన్నది. ఈ సినిమాను తీసేటప్పుడు మామూలు కథను బలంగా చెప్పాలి. ఎక్కువ మలుపులు ఏవీ ఉండకూడదు. రక్తపాతం ఉండకూడదు. మన ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఉండే చిన్న చిన్న విషయాలు ఎందుకు చెప్పకూడదు అనుకున్నాను. నేను దర్శకుడి కంటే ముందు రచయితను అంతకంటే ముందు మధ్య తరగతి వ్యక్తిని. వీటి అన్నిటి కంటే మనిషే ముఖ్యం. అతని ఆలోచనలు గొప్పవైతే మనిషి గొప్పగా ఎదుగుతాడు. తక్కువగా ఉంటే వెనకపడిపోతాం. కానీ మనమెక్కడో ఆలోచిస్తున్నాం. మనం మాట్లాడుకోవడం మానేశాం. ప్రపంచం బావుండాలంటే ఇద్దరు మనుషులు మనసు విప్పి మాట్లాడుకుంటే సరిపోతుంది. ప్రపంచంలో గొప్ప విషయాలన్నింటినీ దేవుడు ఫ్రీగానే ఇచ్చాడు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే సున్న్నితంగా  ఉండే వినోదం ఎందుకివ్వలేం అనిపించింది కులాలు మధ్య, మతాల మధ్య, వికలాంగుల మీద జోకులు వేయకుండా బూతులు లేని కామెడి ఇవ్వడానికి నేను మొదటి నుండి ప్రయత్నిస్తున్నాను. మొదటి నుండి నా ప్రయాణం కూడా అదే. దాని కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. బూతు మాట్లాడితే నవ్వుతారు కానీ తక్కువగా చూస్తారు. అందుకే లేటయినా మంచినే చెప్పాలనిపిస్తుంది. బిరియాని, మసాలాలు తిన్న మనకు ఎప్పుడైనా ఫుడ్ పాయిజనింగ్ అయిపోతే డాక్టరు చారన్నం తినమంటాడు. నా దృష్టిలో ఈ సినిమా చారున్నంలాంటిది. ఎక్కువ పులుపు, తీపు, ఉప్పు ఉండదు. ఏ తప్పు చేయకుండా బ్రతకడం తేలిక కాదు. మామూలుగా బ్రతికిన వాళ్లే మహానుభావులు. ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్’’ అన్నారు.

కధానాయకుడు నితిన్ మాట్లాడుతూ ‘’సై తర్వాత నేను మళ్లీ ఇప్పుడు గుంటూరుకు వచ్చాను. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. ఈ సినిమాలో ప్రతి ఆర్టిస్ట్ కు సమానంగా పేరు వచ్చింది. అలా రావడానికి కారణం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారే కారణం. అందరి క్యారెక్టర్స్ ను బాగా రాశారు. మిక్కి వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాకు నట్టిగారు ఎక్స్ ట్రార్డినరీ సినిమాటోగ్రఫీని అందించారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ గారే అసలైన హీరో. ఈ విజయం నాకెంతో కీలకం. నాకు, టీంకు ఎంతో మంచి విజయాన్ని అందించారు. నా దృష్టిలో ‘అఆ’ అంటే అంతా ఆయనే. అలాగే నిర్మాతగారికి థాంక్స్. నేను బాగా డల్ గా ఉన్నప్పుడు నా అన్నయ్య పవన్ గారు ‘ఇష్క్’ కు వచ్చారు. ఆ సినిమా పెద్ద సక్సెస్ సాధించి నా లైఫ్ కు మంచి టర్నింగ్ పాయింట్ అయ్యింది. అలాగే ‘గుండెజారి గల్లతయ్యిందే’ చిత్రానికి తన అభినందనలు తెలిపారు. ఆ సినిమా కూడా పెద్ద సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ఆడియో వేడుకకు వచ్చి అభినందించారు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది..ఆయన ప్రత్యేక ధన్యవాదాలు’’ అన్నారు.

DSC_7439 DSC_7432 DSC_7334 DSC_7305 DSC_7334 DSC_7412 DSC_7410
ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘’ సాధారణంగా మా డిస్ట్రిబ్యూటర్స్ పరంగా కొన్ని సినిమాలకు మ్యాజిక్ జరుగుతాయి. ఆది, పోకిరి, గబ్బర్ సింగ్, బాహుబలి, ఇప్పుడు ఈ సినిమా మ్యాజిక్ చేసింది. ఓసారి నేను, బన్ని, శ్రీనివాస్ గారు లోకేషన్ లో లంచ్ చేస్తున్నప్పుడు త్రివిక్రమ్ గారు కొన్ని సీన్స్ చెప్పారు. చెప్పగానే బన్ని సమర్పణలో నేను నిర్మాతగా సినిమా చేయడానికి రెడీ అన్నాం. కొన్ని రోజుల తర్వాత చినబాబుగారు నిర్మాతగా సినిమా స్టార్టయ్యింది. చినబాబుగారితో ఉన్న పరిచయంతో ఈ సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులు కొన్నాను. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఓ టార్గెట్ ఉంటుంది. రెండు మూడేళ్ల వరకు అందరూ హీరోలు 50 కోట్ల క్లబ్ లోకి వెళ్లాలని కోరిక ఉండేది, ఇప్పుడు అందరూ వందకోట్ల క్లబ్ లోకి వెళ్లాలని కోరిక ఉంది. నితిన్ ను 50 కోట్ల క్లబ్ లోకి తీసుకెళ్లినందకు త్రివిక్రమ్ గారికి థాంక్స్. నితిన్ టార్గెట్ ఇప్పుడు వందకోట్లు. ప్రతి ఒక యాక్టర్ నుండి అద్భుతమైన నటనను రాబట్టుకుని సినిమాను పెద్ద సక్సెస్ చేసిన త్రివిక్రమ్ గారికి మా డిస్ట్రిబ్యూటర్స్ తరపున స్పెషల్ థాక్స్. ఓవర్ సీస్ లో ఈ సినిమా 2.5 మిలియన్ మార్క్ ను టచ్ చేయబోతుంది. స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యమైన ఈ టార్గెట్ త్రివిక్రమ్, నితిన్ గారి ‘అఆ’ రీచ్ అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ మూవీగా నిలిచింది. చినబాబుగారు సినిమా హిట్ సాధించినందుకు ఆయన చాలా ఆనందంగా ఉన్నారు’’ అన్నారు.

కధానాయికలలో ఒకరైన అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ ‘’ఇలాంటి మంచి మూవీలో నేను పార్ట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. త్రివిక్రమ్ గారికి చాలా థాంక్స్. ఆయనతో పాటు నితిన్, సమంత, నదియా, నరేష్ గారు సహా అందరికీ థాంక్స్’’ అన్నారు.

సీనియర్ నటి నదియామాట్లాడుతూ ‘’సినిమా సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. త్రివిక్రమ్ గారి మరో మ్యాజికల్ హిట్ లో నేను పార్ట్ అయినందుకు ఆయనకు థాంక్స్. నితిన్, సమంతకు ఈ చిత్రం గ్రేట్ ఫిలిం అయ్యింది. మ్యూజిక్ అందించిన మిక్కి, సినిమాటోగ్రాఫర్ నటరాజ్ సుబ్రమణ్యంగారు సినిమా సక్సెస్ లో కీ రోల్ పోషించారు’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, అజయ్, హరితేజ, పమ్మి సాయి, మధు నందన్ , పాటల రచయిత కృష్ణచైతన్య తదితరులు పాల్గొని చిత్రం సాధించిన విజయం పట్ల తమ సంతోషాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. చివరగా.. 

 చిత్ర దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత ఎస్.రాధాకృష్ణ (చినబాబు), నిర్మాత సూర్యదేవర నాగ వంశి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత పి .డి.వి. ప్రసాద్ లు నటీ,నటులకు,యూనిట్ సభ్యులకు, డిస్త్రి బ్యూటర్ లకు  షీల్డ్స్ అందించారు.